Telangana State Float on Indian Independence Day celebrations in New York

Telangana State Float On Indian Independence Day Celebrations In New York.
69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ అస్తిత్వంతో అలరారిన న్యూయార్క్ నగరం
ఆగష్టు 16 న్యూయార్క్ నగరం - ఉదయం 11 గంటలు - మాడిసన్ అవెన్యూ త్రివర్ణ పతాకాలతో కళకళలాడుతున్నది. ఎటు చూసినా పండగ వాతావరణం. కోలాహలం. ఉత్తర అమెరికాలో ముఖ్యంగా ఈశాన్య ప్రాంతం లో ఉన్న భారతీయులు వేలాదిగా తరలి వచ్చిన సందర్భం. భారతీయ సంప్రదాయ దుస్తుల సంరంభం! 69 స్వాతంత్ర్య దిన సందర్భంగా న్యూయార్క్ నగరంలో జరిగిన 35వ పరేడ్ లో పాల్గొనడానికి భారతీయ సంతతికి చెందిన వేలాది మంది అత్యంత ఉత్సాహంతో సందడి చేస్తున్న వేళ! అట్టహాసంగా అలంకరించబడిన రంగుల రంగుల రథాలు - దాదాపు 50 వరకు - పరేడ్ లో పాల్గొనడానికి సిద్ధమై బారులు తీరి ఉన్నాయి. ఆ ఆనంద కోలాహల వాతావరణం లో, 37 స్ట్రీట్ లో జై భారత్ జై తెలంగాణ అని అందమైన అక్షరాల తో రాసిన బానర్ ని పట్టుకుని కొంత మంది తెలంగాణ ఎన్నారై లు చేతుల్లో త్రివర్ణ పతాకాలతో, జై తెలంగాణ అని రాసిన ప్లకార్డులతో , ధన ధన మోగే డప్పు లతో రంగు రంగుల పూల బతుకమ్మలతో, చక్కగా అలంకరించిన బోనాలతో , తెలంగాణ సంప్రదాయ దుస్తు లు ధరించిన స్త్రీలు, పురుషులు, పిల్లలు తెలంగాణ పాటలు పాడుతూ నినాదాలిస్తూ 69వ భారత స్వాతంత్ర్య ఊరేగింపులో లో చేరడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ రథం వద్ద గుమి గూడిన అపురూప సందర్భం. తెలంగాణ రథం పై అద్భుతంగా అమరిన పది అడుగుల అమరవీరుల స్థూపం అటూ యిటూ అమర్చిన అందాల రంగు రంగుల బతుకమ్మలు – తెలంగాణ హరిత హారాన్ని, కాకతీయ మిషన్ చెరువుల పునరుద్దరణ పథకాలని ప్రతిబింబించే బానర్లు – మేడిన్ తెలంగాణ ప్రధాన బానర్. ఒక గొప్ప సంరంభం సందోహం కోలాహలం సందడి – భారత దేశ 29 వ నవ నూతన రాష్ట్రం తెలంగాణ సంస్కృతి అస్తిత్వాలను ప్రపంచానికి చాటి చెప్పేటందుకు తెలంగాణ యెన్నారై అసోసియేషన్ (తేనా) చేస్తున్న మహత్తర కార్యక్రమం, తెలంగాణకు ప్రత్యేకరథంతో న్యూయార్క్ లో జరుగుతున్న భారత స్వాతంత్ర్య ఊరేగింపులో పాల్గోవడం.

మొట్ట మొదటి సారి , 2012 లో తెలంగాణ ఎన్నారై అస్సోసియేషన్ ఇండియా ఇండిపెండెన్స్ పరేడ్ తెలంగాణా ఎన్నారైలు పెద్ద సంఖ్యలో లో పాల్గొని తెలంగాణ సంస్కృతిని , సాంస్కృతిక చిహ్నాలని , అస్తిత్వాన్ని ప్రకటించి , సొంత రాష్ట్రం కావాలన్న రాజకీయ ఆకాంక్షని ఎలుగెత్తి చాటాలని నిర్ణయం తీసుకుంది. అట్లా గత మూడు సంవత్సరాలుగా అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నది. మొదటి రెండు సార్లు పాదచారులుగా, గత యేడాది నుండీ ప్రత్యేక రథం తోనూ పాల్గొంటున్నది . అందుకోసం రెండు నెలలుగా సన్నాహాలు మొదలు బెట్టింది. బానర్లను, ప్లకార్డులను, బతుకమ్మ బోనాలు లాంటి సాంస్కృతిక చిహ్నాలను సిద్ధం చేసుకున్నది. ఈశాన్య రాష్ట్రాల ఎన్నారైలను పెద్ద ఎత్తున కదిలించే ప్రయత్నాలు చేసింది. దాని ఫలితమే ఇండియా ఇండిపెండెన్స్ పరేడ్ లో పాల్గొనడానికి సర్వ సన్నాహాలతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ఎన్నారైలు.
జైతెలంగాణ అని మిన్నంటే నినాదాలనిస్తూ, తెలంగాణ డప్పు దరువులనేస్తూ పరేడ్ లో చేరడానికి 37 వ స్ట్రీట్ లో ఉరకలేస్తున్నారు. వారి వంతు రాగానే పరేడ్ లోకి తమ ప్రత్యేక రథంతో ఉరికారు. అప్పటిదాకా నెమ్మదిగా పారుతున్న నీటిలాంటి పరేడ్, తెలంగాణా ఎన్నారైలు చేరగానే ఒక జలపాతమైంది. డప్పు దరువులతో , నినాదాలతో పాటలతో, బతుకమ్మలతో ఒక పెను కెరటంలా ఉవ్వెత్తున ఎగసింది. ‘జై భారత్ , జై తెలంగాణ – తెలంగాణ ఎన్నారై అస్సోసియేషన్ ‘ అనే బానర్ ముందు సాగగా వెనుక జై తెలంగాణ నినాదాలు మిన్నంటుతుండగా , తెలంగాణ అమరవీరుల స్థూపంతో అలంకరించబడిన రథం ముందుకు సాగింది. డప్పు దరువులకు తెలంగాణ యువత ధూలా ఆడారు. న్యూయార్క్ నగర వీది మాడిసన్ అవెన్యూ నడి రోడ్దు మధ్య తెలంగాణ ఆడపడుచులు సగర్వంగా తెలంగాణ సంస్కృతిని ప్రకటిస్తూ బతుకమ్మ ఆడారు. లేలేత ప్రాయంలో నినాదాలని, పాటలని తెలంగాణ బాలబాలిక లు అద్భుతంగా పాడారు. ఒక బ్రహ్మాండమైన సాంస్కృతిక ఊరేగింపుగా తెలంగాణవాదులు సాగారు. మధ్య మధ్యలో ఆగుతూ, ధూల వేస్తూ, బతుకమ్మలాడుతూ, పాటలు పాడుతూ, డప్పు దరువులేస్తూ ఒక గంట సేపు న్యూ యార్కు నగర వీధుల్లో తెలంగాణ సాంస్కృతిక జండా ఎగరేసారు. చుట్టూ గుమిగూడిన వేలాది మంది భారతీయ, దేశ దేశాల ప్రజానీకం కన్నుల పండుగగా తిలకిస్తుండగా సాగిన ఊరేగింపులో బోస్టన్ మాసాచూసెట్స్ , కనక్టికట్, ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా.
న్యూ జెర్సీ , ఒహాయో, మిషిగన్, మినియాపాలిస్ తదితర ఉత్తర అమెరికా కు చెందిన అనేక ప్రాంతాల నుండి తెలంగాణ యెన్నారైలు పురుషులు, మహిళలు చిన్నారులు అత్యుత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలు ఆడుతూ, బోనాలెత్తుతూ, డప్పు దరువులకు పురుషులు ధూలా, తీన్మార్లు వేస్తుండగా, తెలంగాణ ఎన్నారైలు నాలుగు వందల కు పైగా కుటుంబ సమేతంగా ఊరేగింపుకు ముందుండి సాగారు. ఇండియా ఇండిపెండెన్స్ పరేడ్లో గంటకు పైగా జై తెలంగాణ నినాదాలతో న్యూయర్క్ నగరం మార్మోగింది. తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలతో అలంకరించిన రథం అలరారింది. సకల సంస్కృతుల సమ్మేళనమై, దేశదేశాల సముద్రాల నీళ్లతో కళకళలాడే న్యూయార్క్ మహానగరం తెలంగాణ సాంస్కృతిక సంరంభమై ఉవ్వెత్తున ఎగసింది, బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకోవాలనే స్వప్నంతో పాల్గొన్న యెన్నారైల ఆకాంక్ష ఊరేగింపులో అడుగడుగునా ప్రస్ఫుటమయింది. యావత్ప్రపంచమూ 29వ నూతన రాష్ట్రం నవ నవోన్మేష తెలంగాణ వైపు చూసేలా, తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ నిర్వహించిన ఊరేగింపు అద్భుతంగా విజయవంతమైంది.
తేనా చేస్తున్న ఇతర కార్యక్రమాలని తెలుసుకోవడానికి www.telangananri.com వెబ్ సైట్ నిచూడండి.
















